వరదలో చిక్కుకున్న కుక్క పిల్లలు.. పోలీసుల చుట్టూ తిరిగిన తల్లి కుక్క.. వీడియో ఇదిగో!

  • కుక్కతో పాటు వెళ్లి దాని పిల్లలను కాపాడిన రెస్క్యూ టీమ్
  • ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
కన్న ప్రేమకు ఏదీ సాటి రాదని ఓ శునకం నిరూపించింది.. వరదలో చిక్కుకున్న పిల్లల కోసం అల్లాడిపోయింది. బిడ్డలను కాపాడాలంటూ సహాయక బృందాల చుట్టూ తిరుగుతూ మూగగా రోధించింది. చుట్టూ తిరుగుతూ మొరుగుతున్న కుక్కను గమనించిన సహాయక సిబ్బంది దాని వెంటే వెళ్లగా వరద నీటిలో చిక్కుకున్న ఓ ఇంట్లో కుక్క పిల్లలు కనిపించాయి. దీంతో అసలు విషయం అర్థం చేసుకున్న పోలీసులు.. ఆ కుక్క పిల్లలను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.

భారీ వర్షాలకు నందిగామ జిల్లాలోని పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. అక్కడున్న జనాలను తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా శ్రమించారు. ఈ క్రమంలో ఓ కుక్క వారి చుట్టూ తిరుగుతోంది. మొదట్లో పట్టించుకోకపోయినా పదే పదే మొరుగుతూ, రోధించడం చూసి రెస్క్యూ సిబ్బంది దాని వెంటే వెళ్లారు. ఆ కుక్క వారిని ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లింది.

ఆ ఇంట్లో కుక్క యజమాని ఉండొచ్చని భావించి లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడ రెండు కుక్క పిల్లలు కనిపించాయి. దీంతో ఆ కుక్క బాధను వారు అర్థం చేసుకోగలిగారు. వెంటనే ఆ పిల్లలను బయటకు తీసుకువచ్చి తల్లి కుక్క చెంతకు చేర్చారు. తన పిల్లల కోసం ఆ కుక్క పడిన ఆరాటం వారి మనసులను కదిలించింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. కుక్క పిల్లలను కాపాడిన రెస్క్యూ టీమ్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.



More Telugu News