శ్రీసత్యసాయి జిల్లాలో కుప్పకూలిన పాఠశాల భవనం.. సెలవు కావడంతో తప్పిన పెను ప్రమాదం

  • నల్లమాడ మండలం బాపనకుంటలో ఘటన
  • వర్షానికి మూడు రోజుల క్రితం కూలిన భవనం గోడ
  • నిన్న శుభ్రం చేసేందుకు వెళ్లగా కుప్పకూలిన భవనం
శ్రీసత్యసాయి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రాథమిక పాఠశాల భవనం ఉన్నపళంగా కుప్పకూలింది. జిల్లాలోని నల్లమాడ మండలం బాపనకుంటలో జరిగిందీ ఘటన. 1986లో పాఠశాలను నిర్మించగా మూడేళ్ల క్రితం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరించడంతో అప్పటి నుంచి వరండాలోనే తరగతి గదులు నిర్వహిస్తున్నారు.

జోరు వానలకు మూడు రోజుల క్రితం భవనంలోని ఓ పక్క గోడ కూలిపోయింది.  దీంతో శిథిలాలు తొలగించేందుకు నిన్న ఉదయం ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి కూలీలతో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో భవనం పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండడంతో భయపడిన వారంతా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కాసేపటికే భవనం కుప్పకూలింది. నిన్న మొహర్రం సెలవు కావడంతో స్కూలుకు సెలవు. లేదంటే పెనుప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News