నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు.. : కరణ్ జొహార్ పై కంగన ఫైర్

  • 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ' సినిమాపై కంగన విమర్శలు
  • ప్రేక్షకులను ఇంకెంత కాలం మోసం చేస్తావంటూ కరణ్ పై ఫైర్
  • సాధారణ వ్యక్తుల మాదిరి డ్రెస్సులు ధరించాలని రణవీర్ కు సూచన
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ అంటేనే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు గిట్టదు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా కరణ్ పై కంగన విరుచుకుపడుతుంటుంది. తాజాగా ఆమె మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. రణవీర్ సింగ్, అలియాభట్ జంటగా కరణ్ జొహార్ 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాను విమర్శిస్తూ కంగన ఇన్స్టాలో వరుస పోస్టులు పెట్టింది. 

ఈ సినిమాలో రణవీర్ సింగ్ కాస్ట్యూమ్స్, కరణ్ దర్శకత్వంపై విమర్శలు గుప్పించింది. రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి ఒక డైలీ సీరియల్ తీశారని ఎద్దేవా చేసింది. ప్రేక్షకులను ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించింది. ఫేక్ కాస్ట్యూమ్స్ ని, ఫేక్ సెట్స్ ని ప్రేక్షకులు అంగీకరించరని చెప్పింది. సినిమాలో రణవీర్ సింగ్ ధరించిన దుస్తులను నిజ జీవితంలో ఎవరైనా ధరిస్తారా? అని ప్రశ్నించింది. 90వ దశకంలో నువ్వు తెరకెక్కించిన చిత్రాలనే మళ్లీ కాపీ కొట్టి రూ. 250 కోట్లతో సినిమా చేసేందుకు సిగ్గుండాలని కరణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

టాలెంట్ ఉన్న ఎందరో దర్శకులు ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్నారని కంగన తెలిపింది. ఇండస్ట్రీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో డబ్బులు వృథా చేయడం మానేయాలని... దర్శకుడిగా రిటైర్ అయిపోవాలని కరణ్ కు సూచించింది. కొత్త టాలెంట్ కు అవకాశం కల్పించాలని చెప్పింది. ఇదే సమయంలో రణవీర్ సింగ్ కు కూడా ఓ సలహా ఇచ్చింది. డ్రెస్సింగ్ విషయంలో కరణ్ జొహార్ ను ఫాలో కావొద్దని సూచించింది. సాధారణ వ్యక్తుల మాదిరి దుస్తులను ధరించాలని చెప్పింది. దక్షిణాది నటులు ఎంత హుందాగా దుస్తులు ధరిస్తారో చూడమని తెలిపింది.


More Telugu News