ఒక ఓవర్లో 7 సిక్సులు... వరల్డ్ రికార్డు సమం చేసిన ఆఫ్ఘన్ యువ క్రికెటర్

  • ఆఫ్ఘనిస్థాన్ లో కాబూల్ ప్రీమియర్ లీగ్ పోటీలు
  • షాహీన్ హంటర్స్ వర్సెస్ అబాసిన్ డిఫెండర్స్ మ్యాచ్
  • 56 బంతుల్లోనే 118 పరుగులు చేసిన షాహీన్ హంటర్స్ ఆటగాడు సెదిక్
  • 19వ ఓవర్లో సిక్సర్ల మోత
  • ఇప్పటివరకు రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డు
  • తాజాగా హిట్టింగ్ తో రుతురాజ్ సరసన సెదిక్
చిన్నదే అయినప్పటికీ ప్రతిభావంతులైన క్రికెటర్లకు లోటు లేని దేశం ఆఫ్ఘనిస్థాన్. అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ఎదుగుతున్న తీరే అందుకు నిదర్శనం. నిధుల లేమి, సౌకర్యాల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘన్ దేశవాళీ క్రికెట్ నాణ్యమైన ఆటగాళ్లను అందిస్తోంది. 

ఇక అసలు విషయానికొస్తే... ఆఫ్ఘనిస్థాన్ యువ క్రికెటర్ సెదిక్ అటల్ తన విధ్వంసక బ్యాటింగ్ తో ప్రపంచ రికార్డును సమం చేశాడు. సెదిక్ ఒకే ఓవర్లో 7 సిక్సులు బాది, భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సరసన చేరాడు. 2022లో విజయ్ హజారే టోర్నీలో రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సర్టు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుతం కాబూల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు జరుగుతోంది. సెదిక్ అటల్ ఈ టోర్నీలో షాహీన్ హంటర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అబాసిన్ డిఫెండర్స్ తో మ్యాచ్ లో సెదిక్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెదిక్ 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సులతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  

ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అబాసిన్ డిఫెండర్స్ బౌలర్ అమీర్ జజాయ్ వేసిన బంతులను స్టాండ్స్ లోకి కొట్టిన సెదిక్ వరల్డ్ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు.


More Telugu News