జగన్ పని అయిపోయింది... రాబోయే 9 నెలలే కీలకం: నారా లోకేశ్

  • ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో యువగళం
  • గుండ్లాపల్లి క్యాంప్ సైట్ లో పర్చూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో లోకేశ్ భేటీ
  • రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం
  • ప్రతి ఓటూ కీలకమేనని వెల్లడి
  • చివరి ఓటు వరకు ప్రయత్నించాలని స్పష్టీకరణ
నాయకులు వస్తూ, పోతూ ఉంటారని... కార్యకర్తలే శాశ్వతమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈసారి మనం గెలుపుపై కాదు... మెజారిటీపైనే దృష్టిపెట్టాలని పర్చూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. గుండ్లాపల్లి క్యాంప్ సైట్ లో ఇవాళ ఆయన పర్చూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండా, వానను తట్టుకుని ఇప్పటివరకు 2,200 కి.మీ. పాదయాత్ర పూర్తిచేశానని వెల్లడించారు. ఐదు కోట్లమంది ప్రజల ఆశీస్సులు, టీడీపీ కుటుంబసభ్యుల ప్రోత్సాహమే తనను ముందుకు నడిపిస్తోందని అన్నారు. 

"టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నేరుగా పార్టీనే స్పందిస్తోంది. ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధితో పాటు బీమా కల్పించాం. జిల్లాలో పెద్దాయన అని చెప్పుకుని తిరిగిన వ్యక్తి పార్టీ మారారు... కానీ కార్యకర్తలు మారలేదు. గత నాలుగేళ్లలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు... చాలామంది అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం సరైన దారిలో లేదు. రాబోయే తరాలు బాగుండాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలి.  

మొదట టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు చేశారు, ఇప్పుడు ఏకంగా పోలీసులపై కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. అందరం కలసి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. 

పని చేసేవాళ్లను ప్రోత్సహిస్తా. 'మన బూత్... మన భవిష్యత్' కార్యక్రమం ద్వారా అందరూ ప్రతి బూత్ వారీగా పార్టీకి మెజార్టీ తీసుకురండి, మీ భవిష్యత్ నేను చూసుకుంటా" అని భరోసానిచ్చారు.

పర్చూరులో మళ్లీ పసుపు జెండా ఎగరాలి!

పర్చూరులో మళ్లీ టీడీపీ జెండా ఎగరాలి. ఏలూరి సాంబశివరావును భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రభుత్వ ఎదురు దాడులను పర్చూరు ప్రజలు ఎదుర్కొన్నారు. పర్చూరు ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ఈసారి మనం ఎంత మెజారిటీతో గెలుస్తున్నామన్నది ముఖ్యం. క్లస్టర్, బూత్, యూనిట్, మండల అధ్యక్షులు కలసి పని చేయాలి. వారానికి 5 రోజులు... రోజుకు 2 గంటలు కష్టపడండి. 

ఇంటింటికీ వెళ్లండి... ప్రతి తలుపు తట్టండి!

మనం మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం... అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అమలు చేస్తాం. ప్రతి ఇంటి తలుపు తట్టండి... చివరి ఓటు పడే వరకూ కాపలా కాయాలి. ఫలానా వ్యక్తి ఓటే వేయరు అని అనుకోవద్దు... ఒకటికి పదిసార్లు తిరగండి. 

మంగళగిరిలో ఓడిపోయానని నేను ఆ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లలేదు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నాను. నేను పాదయాత్ర ప్రారంభించినప్పుడు అడ్డుకుంటామని అన్నారు... కానీ కార్యకర్తలు వైసీపీ వాళ్లకు బుద్ధి చెప్పారు. మిమ్మల్ని అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని నేను వదిలిపెట్టను. పర్చూరులో మీకు ఏలూరి సాంబశివరావు అండగా ఉంటాడు. 

ఈ 9 నెలల సమయం చాలా కీలకం. జగన్ పనైపోయిందన్న విషయం వైసీపీ కార్యకర్తలకు కూడా అర్థమైంది. జగన్ తీరు నచ్చక టీడీపీకి ఓటేయడానికి వైసీపీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి జగన్ అరాచకపాలనపై చైతన్యం తీసుకురండి... అంటూ నారా లోకేశ్ పర్చూరు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News