భారీ వరదలో ఈదుకుంటూ వెళ్లి కరెంటు వైర్లు సరిచేసిన విలేజ్ హెల్పర్.. ఇదిగో వీడియో!

  • సూర్యాపేట జిల్లా పాతర్లపహడ్‌లో చెరువు నీటిలో పడిపోయిన కరెంటు వైర్లు
  • ఊరికి కరెంటు అందించేందుకు విలేజ్ హెల్పర్ సాహసం
  • ఈదుకుంటూ వెళ్లి, పోల్ ఎక్కి విద్యుత్ లైన్‌ను సరిచేసిన సంతోష్
తెలంగాణలో కురిసిన అసాధారణ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరంగల్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం తదితర జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. 30 మందికి పైగా బలి తీసుకున్నాయి. ఈ విపత్తు సమయంలో ఎంతో మంది వీరోచిత గాథలు వెలుగులోకి వస్తున్నాయి. వాగుల్లో కొట్టుకుపోతున్న వాళ్లను కాపాడిన వాళ్లు, మునిగిన ఇళ్ల నుంచి బాధితులను రక్షించిన వాళ్లు ఎందరో!

వరంగల్ జిల్లా కల్లెడ చెరువు నిండడటంతో ఊరు మునిగిపోకుండా అర్ధరాత్రి శ్రమించి ఎస్ఐ వీరభద్ర రావు కాపాడారు. ఇప్పుడు మరొకరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊరికి వెలుగు అందించడం కోసం ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. ఉప్పొంగుతున్న వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ లైన్‌ను సరిచేశాడు. 

భారీ వరదల కారణంగా సూర్యపేట జిల్లాలోని పాతర్లపహడ్‌ వద్ద చెరువు నీటిలో ఓ విద్యుత్తు స్తంభం నుంచి వైర్లు తెగిపడ్డాయి. కొప్పుల సంతోష్ అనే విలేజ్‌ హెల్పర్‌.. తన ప్రాణాలకు తెగించి డ్యూటీ చేశాడు. చెరువులో ఈదుకుంటూ వెళ్లి, విద్యుత్తు స్తంభంపై రిపేర్లు చేశాడు. కరెంటు వైర్లను సరి చేశాడు. 

‘‘ఓ విపత్తు తర్వాత.. పోలీసులు, జిల్లా అధికారులకు మనం కృతజ్ఞతలు చెబుతాం. నిజానికి వారు అందుకే అర్హులే. కానీ కొందరు వెలుగులోకి రాని హీరోలను మనం పట్టించుకోం. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పాతర్లపహాడ్ గ్రామంలో విద్యుత్తును పునరుద్ధరించడానికి సాహసం చేసిన కొప్పుల సంతోష్ కూడా అలాంటి వ్యక్తే” అంటూ కృష్ణమూర్తి అనే యూజర్ ట్వీట్ చేశారు. ‘గొప్ప పని చేశావ్ సంతోష్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


More Telugu News