పోషకాల్లో తిరుగులేని పొద్దుతిరుగుడు.. విత్తనాలు తింటే లాభాలెన్నో!
- వంటల్లో విరివిగా సన్‌ఫ్లవర్ ఆయిల్
- పొద్దు తిరుగుడు విత్తనాలతో బోలెడు ప్రయోజనాలు
- ఎముకల బలానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడే గింజలు
- గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకూ సాయపడతాయ్
పొద్దుతిరుగుడు విత్తనాల నుంచి తీసే నూనెను మనం వంటల్లో ఉపయోగించుకుంటాం. నిజానికి వంటల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ వాటానే ఎక్కువ కూడా. వేయించిన పొద్దు తిరుగుడు విత్తనాలను కొందరు చాలా ఇష్టంగా తింటుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సినిమాకు వెళ్లేవాళ్లు గుప్పెడు జోబులో వేసుకుని వెళ్తుంటారు. సినిమా చూస్తూ ఈ విత్తనాలు తినడం ఓ టైమ్‌పాస్.
ఇలా టైమ్ పాస్ కోసం తినే ఈ గింజలు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడుతున్నాయనే విషయం చాలా మందికి తెలియదు. పొద్దుతిరుగుడు గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఎముకలు బలంగా ఉండటానికి, బరువు తగ్గడానికి, జుట్టుకు పోషణ అందించడానికి, గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో సహా ముఖ్యమైన పోషకాలు పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉంటాయి. మోనోశాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచడానికి సహాయపడతాయి.
విత్తనాల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటు స్థాయులను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మీ రోజువారి ఆహారంలో గుప్పెడు పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వీటిలో రాగి, మాంగనీస్, సెలీనియం, భాస్వరం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి వివిధ శారీరక ప్రక్రియలకు అవసరం. పొద్దుతిరుగుడు విత్తనాలను మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉంటాయి.
పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్ ఈ.. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. పర్యావరణ కారకాల వల్ల కలిగే ఫ్రీ రాడికల్ నష్టాన్ని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గేందుకు కూడా సన్ ఫ్లవర్ సీడ్స్ సాయపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపును తొందరగా నింపుతాయి. విత్తనాల్లోని బీ-కాంప్లెక్స్ విటమిన్లు జీవక్రియను పెంచడానికి సాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లోని మెగ్నీషియం ఎముకల బలాన్ని పెంచుతుంది.