అమర్ నాథ్ యాత్రికులతో తిరిగొస్తున్న బస్సుకు ప్రమాదం.. మహారాష్ట్రలో ఆరుగురి మృతి

  • గాయాలతో ఆసుపత్రిలో చేరిన మరో 20 మంది
  • శనివారం తెల్లవారుజామున బుల్దానా జిల్లా మల్కాపూర్ లో ఘోరం
  • ఎదురెదురుగా ఢీ కొన్న రెండు బస్సులు
మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒక బస్సు అమర్ నాథ్ యాత్రికులను తిరిగి తీసుకొస్తుండగా.. రెండోది ప్రైవేట్ ట్రావెల్ బస్సు. యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకున్నారు.. తెల్లారితే క్షేమంగా ఇంటికి చేరుకుంటారనగా ఈ ఘోరం జరిగింది. రాష్ట్రంలోని బుల్దానా జిల్లా మల్కాపూర్ దగ్గర్లోని నందూర్ నాకా ప్లైఓవర్ పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులను తీసుకు వస్తున్న బస్సు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మందిని బుల్దానా జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ 32 మంది ప్రయాణికులకు ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు. బుల్దానా జిల్లాలో ఈ నెలలో జరిగిన రెండో ఘోర ప్రమాదమిది. ఈ నెల 1న సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పైన బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఇదే జిల్లాలో మే 23న నాగ్ పూర్ - పూణే హైవే పైన ట్రక్కు, బస్సు ఢీ కొన్నాయి. దీంతో ఏడుగురు ప్రయాణికులు చనిపోగా మరో 13 మంది గాయాలపాలయ్యారు.


More Telugu News