నెలకు రూ.5.5 లక్షలు..అలా 25 ఏళ్ల పాటు చెల్లింపులు..ఎన్నారైకి బంపర్ లాటరీ

  • దుబాయ్‌ లాటరీలో విజేతగా నిలిచిన యూపీ వాసి మొహమ్మద్ ఆదిల్ ఖాన్
  • తనకు ఇంతటి అదృష్టం పడుతుందని ఎన్నడూ ఊహించలేదని వ్యాఖ్య
  • తాను లాటరీ గెలిచిన విషయాన్ని కుటుంబసభ్యులు కూడా నమ్మలేకపోయారన్న ఆదిల్
  • తనపై రెండు కుటుంబాలు ఆధారపడ్డాయని, ఈ డబ్బు తనకు ఎంతో అవసరమని వెల్లడి
దుబాయ్ లాటరీని నమ్ముకున్న మరో ఎన్నారై రాత్రికిరాత్రి కోటీశ్వరుడైపోయాడు. నెలకు రూ.5.5 లక్షల చొప్పున ఏకంగా 25 ఏళ్ల పాటు విడతల వారీగా లాటరీ డబ్బు అందుకోనున్నాడు. యూపీకి చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్ కొంతకాలంగా దుబాయ్‌లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంటీరియర్ డిజైనింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు ఎమిరేట్స్ లాటరీ సంస్థకు చెందిన ‘ఫాస్ట్ 5’ లాటరీ టిక్కెట్టు కొన్నాడు. తాజాగా ఈ మెగా లాటరీ డ్రాలో మొదటి విజేతగా నిలిచాడు. గురువారం సంస్థ ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించింది. లాటరీ గెలుచుకున్న ఆదిల్ నెలకు రూ.5,59,822 చొప్పున 25 ఏళ్ల పాటు ప్రైజ్ మనీ పొందుతారు. ఈ విషయం తెలిసి అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. 

ప్రస్తుతం డబ్బు అవసరంలో ఉన్న తనను ఈ లాటరీ అన్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని ఆదిల్ చెప్పాడు. లాటరీ గెలిచిన విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెబితే వారు మొదట నమ్మలేకపోయారని, మరోసారి అన్నీ సరిచూసుకోమని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. కరోనా సమయంలో తన అన్న చనిపోయాడని ఆదిల్ చెప్పాడు. తనకు అయిదేళ్ల కూతురు ఉందని అన్నారు. ఇరు కుటుంబాలకు తనే ఆధారమని చెప్పుకొచ్చాడు. కాగా, విజేత మేలు దృష్ట్యా లాటరీలో గెలిచిన మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేందుకు నిర్ణయించామని లాటరీ నిర్వాహకులు తెలిపారు.


More Telugu News