డల్లాస్ ఏదీ అని ప్రశ్నిస్తే జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్‌గా వెళ్లిపోయారు: కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్

  • వరద బాధితులకు రూ.10వేలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్
  • కేటీఆర్ ఏం చెప్పకపోవడంతో కమిషనర్ హామీ ఇవ్వలేదన్న అంజన్ కుమార్
  • నిత్యావసర సరుకులు అందించాలని కోరిన కాంగ్రెస్
హైదరాబాద్‌లో వరద బాధితులకు తక్షణమే రూ.10,000 ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ శుక్రవారం జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... నగరాన్ని డల్లాస్ చేస్తామని చెప్పారని, మరి డల్లాస్ ఏదీ అని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్‌ను ప్రశ్నిస్తే, ఆయన సీరియస్ గా వెళ్లిపోయారని చెప్పారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కేటీఆర్ ఇంకా ఏమీ చెప్పనందునే కమిషనర్ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ... ముంపు ప్రాంతవాసులకు నిత్యావసర సరుకులు అందించాలని కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. 

రీట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నీట మునగడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తమ పార్టీ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టామని, అయితే పోలీసులు తమను అడ్డుకొని అరెస్ట్ చేశారని ఎన్ఎస్‌యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ చేసిన ట్వీట్ ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేశారు. పోలీసులు తమను అమానుషంగా అడ్డుకొని అరెస్ట్ చేసినట్లు వెంకట్ పేర్కొన్నారు. 

హైదరాబాద్ వరదలతో అల్లాడుకుంటే కేటీఆర్, కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు... జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఉపాధి లేని పేదలకు, కార్మికులకు రూ.10,000 చొప్పున వెంటనే ఇవ్వాలని, వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.


More Telugu News