ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణ స్వీకారం

  • విజయవాడలో శుక్రవారం ప్రమాణ స్వీకారం
  • జస్టిస్ ధీరజ్ సింగ్ తో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
  • కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ ధీరజ్ సింగ్ తో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జస్టిస్ ధీరజ్ సింగ్ కు గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, మంత్రులు అభినందనలు తెలిపారు.

అత్యంత సౌమ్యుడు, వివాదరహితుడు, సమర్థుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. ఇంతకుముందు ఆయన బాంబే హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తీర్థసింగ్‌ ఠాకూర్‌ సోదరుడే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ కుటుంబంలో అందరూ న్యాయమూర్తులే.. ఆయన తండ్రి, సోదరుడు న్యాయమూర్తులుగా పనిచేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ 2026 ఏప్రిల్‌ 24 వరకు కొనసాగుతారు. ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.


More Telugu News