సన్నీ డియోల్‌ను గెలిపించి తప్పుచేశాం.. గురుదాస్‌పూర్ ఓటర్ల ఆగ్రహం

  • భారత్-పాక్ మధ్య వైషమ్యాలకు రాజకీయ నిందలే కారణమన్న బాలీవుడ్ నటుడు
  • గదర్-2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా వ్యాఖ్యలు
  • తమ సమస్యలను ఆయన ఏనాడూ లోక్‌సభలో ప్రస్తావించలేదంటున్న గురుదాస్‌పూర్ ప్రజలు
  • గెలిచాక ఒక్కసారి కూడా రాలేదని మండిపాటు
భారత్-పాకిస్థాన్ మధ్య విద్వేషానికి ‘పొలిటికల్ గేమ్’ కారణమని బాలీవుడ్ స్టార్ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ గ్రామస్థులు సన్నీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

గదర్-2 సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా సన్నీ డియోల్ మాట్లాడుతూ.. ఇండియా-పాక్ మధ్య సంబంధాలు దెబ్బతిని వైషమ్యాలు పెరగడానికి రాజకీయ పరమైన నిందలే కారణమని ఆరోపించారు. రెండు దేశాల్లోనూ శాంతిని కోరుకునే ప్రజలు ఉన్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై గురుదాస్‌పూర్ ప్రజలు మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతున్న సన్నీడియోల్ లోక్‌సభలో ఏనాడూ గురుదాస్‌పూర్ సమస్యలపై మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన గెలిచాక నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది మచ్చుకైనా లేదని, గెలిపించి తప్పు చేశామని చింతిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, కానీ ఒక్కసారి కూడా ఆయన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడానికి ముందు ఆయన తన నియోజకవర్గ ప్రజలకు చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి పోటీచేసిన సన్నీడియోల్ విజయం సాధించారు. అంతకుముందు 2017 వరకు బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సునీల్ ఝకర్ గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల వరకు గురుదాస్‌పూర్ ఎంపీగా కొనసాగారు.


More Telugu News