ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు ముందు దిల్ రాజు కీలక ప్రకటన

  • ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్న దిల్ రాజు
  • ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరినొకరు నిందించుకోవడం సరికాదని వ్యాఖ్య
  • ఫిల్మ్ చాంబర్ కు చెందిన రంగాల్ని ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామని హామీ
ఈ నెల 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ఆయన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన ప్యానెల్ సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తాను అధ్యక్షుడిగా ఎందుకు పోటీ చేస్తున్నాననే విషయాన్ని తెలిపారు.

తనకు పదవి ముఖ్యం కాదని, తెలుగు చిత్ర పరిశ్రమను ఏకతాటిపైకి తీసుకు రావడం లక్ష్యమని చెప్పారు. ఒకరిపై నిందలు వేయడం తన వల్ల కాదన్నారు.

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల సమయంలో యలమంచిలి రవిచంద్ వచ్చి మీరు ఎన్నికల్లో పాల్గొనాలని అంటే, తాను ఎందుకు అని ప్రశ్నించానని వెల్లడించారు. కౌన్సిల్ వెల్ఫేర్ కోసమైతే తాను ఫండ్స్ ఇస్తానని చెప్పానని, ఎన్నికల్లో పాల్గొనడం ఎందుకని అడిగానని చెప్పారు. ఆ తర్వాత ఇన్సురెన్స్ కార్డుల విషయంలో నిర్మాతల ఇబ్బందుల దృష్ట్యా పోటీ చేయాలని కోరితే అందుకు సిద్ధపడ్డానని, అప్పుడు గెలిపించారన్నారు. 

అనంతరం, ఇన్సురెన్స్ కార్డులు తీసుకు వచ్చేందుకు అన్ని కంపెనీలతో మాట్లాడామని, ఏది తక్కువకు వస్తుందో తెలుసుకొని అమలు చేయడానికి కాస్త ఆలస్యమైందన్నారు. అయినప్పటికీ నాలుగు లక్షల ఇన్సురెన్స్ కార్డులు తీసుకువచ్చామన్నారు. పెన్షన్ ఎక్కువ చేశామని, మిగిలిన హామీల అమలుకు ఫండ్ అవసరం ఉందని, అయినప్పటికీ ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.

ఇప్పుడు ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరినొకరు నిందించుకోవడం సరికాదన్నారు. తమకు పదవి ముఖ్యం కాదన్నారు. కౌన్సిల్ ఎన్నికల్లో పోటీకి ఆహ్వానిస్తే ఎలా పని చేశామో... ఇప్పుడు అలానే చేస్తామన్నారు. తమ ప్యానెల్ లో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలు 70 శాతం మంది, చిన్న సినిమాలు చేసే నిర్మాతలు 30 శాతం మంది ఉన్నట్లు చెప్పారు. ఫిల్మ్ చాంబర్ కు చెందిన అన్ని రంగాలను అభివృద్ధి చేసి, ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.


More Telugu News