పవన్ కల్యాణ్ కు తప్పుడు సమాచారం అందించారు: సీనియర్ నటుడు నాజర్

  • తమిళ సినిమాల్లో తమిళ నటులే పనిచేయాలన్న నిబంధన తెచ్చారంటూ ప్రచారం
  • ఇటీవల బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీనిపై వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
  • పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించవద్దన్న నాజర్
  • పవన్ సరైన సమాచారం లేకుండా వ్యాఖ్యానించారని వెల్లడి
తమిళ సినిమాల్లో తమిళ భాషా నటులనే తీసుకోవాలని, తమిళ సినిమాలు తమిళనాడులోనే షూటింగులు జరుపుకోవాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) ప్రకటించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. 

దీనిపై 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కల్యాణ్ స్పందిస్తూ, తమిళ చిత్రాల్లోకి ఇతర భాషల నటులను అనుమతించరాదని భావించడం సరికాదని అన్నారు. ఒకవేళ తమిళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి నియమనిబంధనలు ఏవైనా ఉంటే దయచేసి సవరించండి అని పవన్ విజ్ఞప్తి చేశారు. తమిళ సినిమాల్లోకి ఇతర భాషల నటులు కూడా వచ్చినప్పుడే చిత్ర పరిశ్రమ పైకెదుగుతుందని అభిప్రాయపడ్డారు. 

అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సీనియర్ నటుడు నాజర్ ఖండించారు. తమిళ సినిమాల్లో ఇతర భాషా నటులను అనుతించడంలేదని పవన్ కల్యాణ్ కు తప్పుడు సమాచారం అందించారని అన్నారు. 

"నా సోదరుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వీడియోను నేను కూడా చూశాను. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొత్త రూల్స్ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి, తమిళ సినిమాల్లో కేవలం తమిళ నటులే పనిచేయాలి అనే నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు. 

ఇప్పుడు తెలుగు చిత్రం, తమిళం చిత్రం అని కాదు... టాలీవుడ్, బాలీవుడ్ అని కూడా కాదు... ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలు అంటున్నాం. ఏ భాషలో మంచి చిత్రం తీసినా అన్ని భాషల వారు చూస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు గ్లోబల్ స్థాయికి మన సినిమాను తీసుకెళ్లాయి. అలాంటప్పుడు ఎవరూ ఇలాంటి రూల్స్ తీసుకువచ్చే ప్రయత్నం చేయరు. 

తమిళనాడు సినీ కార్మికుల సంక్షేమం కోసం సెల్వమణి గారు కొన్ని నిబంధనలు తీసుకువచ్చారంతే. ఆ నిర్ణయాల పరిధిలోకి నటులు రారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కు సరైన సమాచారం అంది ఉండకపోవచ్చు. అందుకే, ఆయన వ్యాఖ్యలను ఎవరూ తీవ్రంగా పరిగణించవద్దు. 

తమిళనాడు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఫెఫ్సీ తదితర యూనియన్లలో 24 వేల మంది కార్మికులు ఉన్నారు. తమిళ సినిమాల్లో స్థానిక కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఇక్కడ అసలు నిర్ణయం. అయితే, వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఆ నోటా ఈ నోటా పడి మరో విధంగా ప్రచారం అవుతున్నాయి" అని నాజర్ స్పష్టత ఇచ్చారు.


More Telugu News