హత్యకు గురైన బాలుడు అమర్నాథ్ సోదరిని మా అమ్మ చదివిస్తారు: నారా లోకేశ్

  • ఒంగోలు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • ఒంగోలులో జయహో బీసీ కార్యక్రమం
  • బాపట్ల జిల్లా బాలుడు అమర్నాథ్ గౌడ్ హత్యను ప్రస్తావించిన లోకేశ్
  • జయహో బీసీ కార్యక్రమానికి హాజరైన అమర్నాథ్ సోదరి
  • టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన లోకేశ్
ప్రకాశం జిల్లా ఒంగోలులో యువగళం పాదయాత్రలో భాగంగా జయహో బీసీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ ప్రసంగించారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన బాలుడు అమర్నాథ్ గౌడ్ అంశాన్ని ప్రస్తావించారు. జయహో బీసీ కార్యక్రమానికి అమర్నాథ్ గౌడ్ సోదరి కూడా హాజరైంది. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, సోదరిని వేధింపులకు గురిచేయడంపై ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ గౌడ్ మృతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. 

"గన్ కంటే ముందు జగన్ వస్తారని గతంలో చెప్పారు. కానీ అమర్నాథ్ విషయంలో జగన్ గన్ కంటే ముందు ఎందుకు రాలేదు? హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది. అమర్నాథ్ సోదరిని మా అమ్మ నారా భువనేశ్వరి చదివిస్తారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హంతకులను శిక్షిస్తాం. బాలుడి హత్య వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం" అని లోకేశ్ స్పష్టం చేశారు.


More Telugu News