చేతనైతే సాయం చేయండి.. చిల్లర రాజకీయాలు వద్దు: కేటీఆర్

  • మూసారాంబాగ్ లో మూసీనది వరద పరిస్థితిని సమీక్షించిన కేటీఆర్
  • వర్షాలపై కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడి
  • నిరంతరం పని చేస్తోన్న ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీయవద్దని ప్రతిపక్షాలకు హితవు
కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఈ రోజు మూసారాంబాగ్ లో మూసీనది వరద పరిస్థితిని పరిశీలించారు. బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సాయం అందించాలన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్పారు. వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల నుండి ప్రజలను తరలించాలని అధికారుల్ని ఆదేశించారు. సంబంధిత ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.

ప్రాణనష్టం జరగకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మానుకొని భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని సూచించారు. వర్షంలో నిరంతరం పని చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దన్నారు. విపత్కర పరిస్థితుల్లో చేతనైతే సాయం చేయాలన్నారు. వరంగల్ కూడా నీట మునిగిందని, అవసరమైతే తాను శుక్రవారం అక్కడకు వెళ్తానని చెప్పారు.


More Telugu News