‘బ్రో’ విడుదల నేపథ్యంలో అభిమానులకు సాయితేజ్ విన్నపం!
- రేపు రిలీజ్ కానున్న పవన్ కల్యాణ్, సాయి ధరమ్ ‘బ్రో’ సినిమా
- బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్న సాయితేజ్
- ఫ్యాన్స్ సురక్షితంగా ఉండటమే తనకు అత్యంత ముఖ్యమని వెల్లడి
సూర్య పుట్టినరోజు సందర్భంగా బ్యానర్స్ ఏర్పాటు చేస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా అభిమానులకు సాయి ధరమ్ తేజ్ విజ్ఞప్తి చేశారు. రేపు ‘బ్రో’ సినిమా విడుదల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు సందేశం పంపారు. వేడుకల్లో జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన సూచించారు.
‘‘డియర్ ఫ్యాన్స్.. మీరు చూపిస్తున్న అమితమైన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ‘బ్రో’ని ఒక స్పెషల్ ప్రాజెక్ట్‌గా భావించి మా చిత్రాన్ని మీరెంతగానో సెలబ్రేట్ చేస్తున్నారు. దీనిని మరింత ఎక్కువ మందికి చేరువ చేయడం కోసం భారీ కటౌట్స్, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు” అని ట్వీట్ చేశారు.
‘‘ఈ విధంగా మీ ప్రేమను పొందుతున్నందుకు గర్వపడుతున్నా. బ్యానర్స్, కటౌట్స్ ఏర్పాటు చేసే సమయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా వ్యవహరించండి. మీరు సురక్షితంగా ఉండటమే నాకు అత్యంత ముఖ్యం. ఈ సంతోషకరమైన వేడుకల్లో మీకు ఏమైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను” సాయితేజ్ పేర్కొన్నారు. ‘‘మీ అభిమానం విలువ కట్టలేనిది. ఇదే సమయలో మీ సేఫ్టీ నాకు అంతకన్నా ఎక్కువ. జాగ్రత్తగా ఉండండి.. ప్రేమను పంచుతూ ఉండండి.. మీ సాయి ధరమ్ తేజ్’’ అని లేఖలో పేర్కొన్నారు.