రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ వార్తలపై ఏపీ డీజీపీ స్పందన

  • ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 26 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డీజీపీ
  • మిస్ అయిన మహిళల్లో 23 వేల మందిని ఇప్పటికే గుర్తించామని వెల్లడి
  • 30 వేల మంది మిస్ అయినట్టు కొందరు తప్పుడు లెక్కలు చెపుతున్నారని విమర్శ
ఏపీలో 26 వేల మంది మహిళలు అదృశ్యమైనట్టు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 26 వేల మంది మహిళలు అదృశ్యమయినట్టు లెక్కలు ఉన్నాయని... మిస్ అయిన మహిళల్లో 23 వేల మందిని ఇప్పటికే గుర్తించామని చెప్పారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. రకరకాల కారణాలతో వీరు అదృశ్యమయినట్టు తేలిందని వెల్లడించారు. కొంత మంది అవగాహన లేకుండా 30 వేల మంది అదృశ్యమయ్యారంటూ తప్పుడు లెక్కలు చెపుతున్నారని అన్నారు. 

రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాన్ని గంజాయితో ముడిపెట్టడం సరికాదని డీజీపీ అన్నారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఏజెన్సీలో గత ఏడాది 7 వేల ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశామని తెలిపారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం గంజాయి విశాఖ నుంచి కాకుండా ఒడిశా నుంచి రవాణా అవుతోందని అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టామని చెప్పారు.


More Telugu News