సినిమా బాగుంటే తలెత్తుకోవాలే తప్ప వేరొకరిని కించపరచకూడదంటూ ‘బేబి’పై విష్వక్సేన్‌ పరోక్ష వ్యాఖ్యలు

  • బేబి సినిమా కథను విష్వక్సేన్‌ వినలేదన్న డైరెక్టర్
  • దీనిపై స్పందించిన విష్వక్సేన్
  • చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్‌ సాధించిన బేబి చిత్రం
టాలీవుడ్‌లో చిన్న బడ్జెట్‌తో వచ్చి భారీ హిట్‌ సొంతం చేసుకున్న చిత్రం ‘బేబి’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా సక్సెస్ గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. అదే సమయంలో ఓ హీరో ఈ సినిమా కథను వినడానికి కూడా ఇష్టపడలేదు అని డైరెక్టర్ సాయి రాజేష్ సక్సెస్ మీట్ లో కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆ హీరో విష్వక్సేన్‌ అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా హీరో విష్వక్సేన్‌ పరోక్షంగా స్పందించాడు. పేకమేడలు సినిమా ట్రైలర్‌‌ లాంచ్‌ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఇండస్ట్రీలో ఎవరి బిజీలో వాళ్లు ఉంటారన్నాడు. 

కొన్నిసార్లు కథ వినడం కుదురుతుందని, కొన్నిసార్లు కుదరకపోవచ్చని చెప్పాడు. ‘ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా హిట్ అయితే అందరం సంతోషించాల్సిన విషయం. అంతేగాని కించపరచడం కరెక్ట్ కాదు. ఎన్ని సినిమాలు చేస్తున్నామన్నది పక్కన పెడితే ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉంటారు. కొన్నిసార్లు కథ వినడం కుదురుతుంది, కొన్నిసార్లు కుదరకపోవచ్చు. నా వరకు నేను అవతల వ్యక్తి టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని అనుకుంటాను. గంటసేపు కథ విని నో చెప్పడం కంటే ముందే నో చెప్పడం బెటర్ అని చెప్పాను. దీనికి కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఈ విషయంలో మనం ఏమీ చేయలేం. అందరినీ హ్యాపీ చేయడానికి నేను బిర్యానీని కాదు. నిజానికి ఆ సినిమా ట్రైలర్ చూడగానే బాగుందని డైరెక్టర్స్ గ్రూపులో కంగ్రాట్స్‌ అని మొదట మెసేజ్‌ చేసిన వ్యక్తిని నేనే. మన సినిమా బాగుంటే తలెత్తుకోవాలె. అంతేతప్ప వేరొకరిని కించపరచకూడదు. అదొక్కటి బాధించింది’ అని చెప్పుకొచ్చాడు.


More Telugu News