ఆ దాడి మా పనే.. మొత్తానికి అంగీకరించిన ఉక్రెయిన్!

  • గతేడాది అక్టోబర్‌‌లో కెర్చ్‌ బ్రిడ్జిపై భారీ పేలుడు
  • ట్రక్కు బాంబు పేలుడుతో వంతెన పాక్షికంగా ధ్వంసం
  • ఈ దాడి జరిపింది తామేనని ప్రకటించిన ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చీఫ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కలల వంతెనగా పేరుపొందిన ‘కెర్చ్‌ బ్రిడ్జి’పై గతేడాది భారీ పేలుడుకు కారణమేంటనేది తాజాగా బయటికొచ్చింది. రష్యా-క్రిమియాను కలిపే కీలకమైన ఈ వంతెనపై తామే దాడి చేసినట్లు ఉక్రెయిన్ తొలిసారి అంగీకరించింది. ‘కెర్చ్‌ బ్రిడ్జి’పై పేలుడు ఉక్రెయిన్‌ పనేనంటూ రష్యా చేసిన ఆరోపణలు నిజమేనని తాజా ప్రకటనతో తేలిపోయింది.

ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్‌బీయూ) చీఫ్ వాసిల్‌ మాల్యుక్‌ ఈ దాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘మేం ఎన్నో ఆపరేషన్లు నిర్వహించాం. అందులో కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. మేం విజయం సాధించిన తర్వాత వాటి వివరాలు బహిరంగంగా చెప్పగలం. గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన క్రిమియా వంతెనపై జరిపిన దాడి అలాంటి వాటిలో ఒకటి” అని ప్రకటించారు. ఆయన మాటలు అక్కడి టీవీలో ప్రసారం అయ్యాయి.

గత ఏడాది రష్యా అధ్యక్షుడు పుతిన్ 70వ పుట్టినరోజు చేసుకున్న మరుసటి రోజే క్రిమియా వంతెనపై దాడి జరిగింది. ఆ వంతెనపై ట్రక్కు బాంబు పేలడంతో.. సమీపంలోని రైలు లైన్‌పై వెళ్తున్న చమురు ట్యాంకర్లు మంటల్లో చిక్కుకొన్నాయి. ఆ దాడి తీవ్రతకు వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ వంతెనపై దాడికి తాము కారణం కాదని ఇంతకాలం తోసిపుచ్చిన ఉక్రెయిన్‌.. తాజాగా తొలిసారి బాధ్యత తీసుకుంది.


More Telugu News