తెలంగాణలో 1520 ఏఎన్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇవిగో!

  • వైద్యారోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
  • ఆగస్టు 25 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
  • సెప్టెంబర్ 19 తో ముగియనున్న గడువు
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1520 పోస్టుల నియామక ప్రక్రియను మొదలుపెట్టింది. ఈమేరకు వైద్యారోగ్య సేవల నియామక బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి బుధవారం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఏఎన్ఎం (మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్- ఫిమేల్) పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 25 న ఉదయం 10:30 గంటల నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని, సెప్టెంబర్ 19న సాయంత్రం 5:30 గంటలతో దరఖాస్తు గడువు ముగుస్తుందని గోపీకాంత్ రెడ్డి వివరించారు. ఎంపిక అయినవారికి నెలకు రూ.31,040 నుంచి రూ.92,050 వరకు జీతం చెల్లించనున్నట్లు తెలిపారు.

దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే స్వీకరించనున్నట్లు రిక్రూట్ మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు.

అర్హతలు..
  • అభ్యర్థులు తప్పనిసరిగా మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రైనింగ్‌ కోర్సు లేదా ఇంటర్‌లో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ శిక్షణ కోర్సు పూర్తిచేసి ఉండాలి
  • తెలంగాణ రాష్ట్ర నర్సెస్‌ అండ్‌ మిడ్‌ వైవ్స్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ చేసుకొని ఉండాలి
  • ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లినికల్‌ ట్రైనింగ్‌ లేదా గుర్తించిన ఆస్పత్రుల్లో ఏడాది అప్రెంటిషిప్‌ పూర్తి చేసి ఉండాలి
  • దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి

ఎంపిక ప్రక్రియ..
  • బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో ఓఎంఆర్‌ లేదా కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో ప్రతిభ ఆధారంగా..
  • పరీక్ష కేవలం ఇంగ్లిష్ లో మాత్రమే నిర్వహిస్తారు
  • రాత పరీక్షకు గరిష్ఠంగా 80 పాయింట్లు.. ఎక్స్ పీరియెన్స్ కు 20 పాయింట్లు
  • గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్లు
  • గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్లు
  • జోన్ల వారీగా పోస్టుల భర్తీ.. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ అమలు

దరఖాస్తుల స్వీకరణ.. గడువు: ఆగస్టు 25 నుంచి.. సెప్టెంబర్ 19



More Telugu News