అతిభారీ వర్షాల నేపథ్యంలో.. తెలంగాణలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు!
- ఇప్పటికే బుధ, గురువారాలు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- ఎడతెరిపి లేని వానలతో మరో రోజు పొడిగింపు
- రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు, రేపు కూడా ఇలానే కుండపోత వానలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం కూడా విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే బుధ, గురువారాలు సెలవులు ఇవ్వగా.. మరోరోజు పొడిగించింది.
మరోవైపు తెలంగాణలోని పలు చోట్ల ఇవాళ కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్రవారం పలు జిల్లాలో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నేడు రెడ్ అలర్ట్, శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.