మునిగిన వరంగల్.. స్విమ్మింగ్ ఫూల్‌లా రైల్వే స్టేషన్.. ఇవిగో వీడియోలు!
- భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలం
- జలాశయాలను తలపిస్తున్న నగర కూడళ్లు
- భారీ కాల్వల్లా మారిపోయిన ప్రధాన రహదారులు
తెలంగాణలో భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. కడెం సహా పలు ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇటు వానలు, అటు వరదల ధాటికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి. తెలంగాణలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన వరంగల్ నీట మునిగింది. కూడళ్లు జలాశయాలను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులు భారీ కాల్వల్లా మారిపోయాయి.
భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరద పోటెత్తింది. హనుమకొండ-వరంగల్ రహదారి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నిలిచింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమైంది. వరంగల్ నగరంలోని కాజీపేట రైల్వే స్టేషన్‌లోకి భారీగా నీరు చేరుకుంది. దాదాపు మోకాళ్ల లోతులో నీళ్లున్నాయి.
మైలారం వద్ద భారీ వృక్షం కూలి అధిక సంఖ్యలో వాహనాలు నిలిచాయి. మరో రెండు రోజులు జిల్లా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో.. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.