డేంజర్‌ జోన్‌లో కడెం ప్రాజెక్ట్.. ఉరుకులు పరుగులతో వెనక్కి వచ్చేసిన ఎమ్మెల్యే, మంత్రి.. వీడియో ఇదిగో!

  • 14 గేట్లు ఎత్తి నీటి విడుదల.. మొరాయించిన నాలుగు గేట్లు
  • పరిశీలనకు వెళ్లిన ప్రజాప్రతినిధులు
  • ప్రాజెక్టు పరిస్థితి చూసి ఎమ్మెల్యే పరుగు.. మంత్రి మొక్కులు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉండగా.. అందులో ప్రస్తుతం నాలుగు గేట్లు మొరాయించాయని అధికారులు వెల్లడించారు. గేట్లను మరమ్మతు కోసం నిపుణులను పిలిపించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 14 గేట్లను ఎత్తి 2.19 లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి విడుదల చేసినట్లు వివరించారు. ప్రాజెక్టు నిండుకోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను తరలించి ఇళ్లను ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజలను తరలించేందుకు హెలికాఫ్టర్లను అధికారులు సిద్ధం చేశారు.

ఎమ్మెల్యే పరుగులు.. మంత్రి మొక్కులు
వర్షాలు, వరదల నేపథ్యంలో కడెం ప్రాజెక్టును పరిశీలించేందుకు ఎమ్మెల్యే రేఖా నాయక్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లారు. వారితోపాటు ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. అయితే, ప్రాజెక్టు పరిస్థితి చూసి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించడంతో వారు వెనుతిరిగారు. ఏ క్షణంలో ఏంజరుగుతుందో తెలియని పరిస్థితిని చూసి ప్రజాప్రతినిధులు పరుగులు పెట్టారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇతర అధికారులతో కలిసి వడివడిగా వెనక్కి మళ్లారు. వరద తగ్గితే కట్టమైసమ్మకు మొక్కు చెల్లించుకుంటానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.


More Telugu News