లండన్‌లో రోడ్డు ప్రమాదం.. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తెలుగు యువకుడి మృతి

  • రెండేళ్ల క్రితం పైచదువుల కోసం లండన్ వెళ్లిన గుంటూరు యువకుడు కిరణ్ కుమార్
  • ఎంఎస్ అనంతరం ఉద్యోగం కోసం అదనపు కోర్సులు చేస్తున్న వైనం
  • జూన్ 26న బైక్‌పై క్లాసులకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం
  • పోలీసులను తప్పించుకునే క్రమంలో కిరణ్‌ను కారుతో ఢీకొట్టిన దొంగ
  • తీవ్రగాయాల పాలైన కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • నెల రోజుల ప్రయత్నాల అనంతరం స్వదేశానికి కిరణ్ మృతదేహం తరలింపు
కోటి కలలతో లండన్‌ వెళ్లిన ఓ తెలుగు యువకుడు అనూహ్యరీతిలో మరణించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ దొంగ కారుతో అతడిని ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండగా చిన్న కుమారుడు కిరణ్‌ కుమార్ (25) రెండేళ్ల క్రితం పైచదువుల కోసం లండన్ వెళ్లాడు. 

ఎంస్ పూర్తి చేసిన కిరణ్ ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా నిపుణుల సూచనల మేరకు అదనపు కోర్సులు చేస్తున్నాడు. జూన్ 26న ద్విచక్రవాహనంపై తరగతులకు వెళుతుండగా ఓ కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ దొంగ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కిరణ్‌ను కారుతో ఢీకొన్నాడు. తీవ్రగాయాల పాలైన కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెలపాటు అనేక ప్రయత్నాలు చేసిన కిరణ్ కుటుంబసభ్యులు అతడి మృతదేహాన్ని లండన్‌ నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు.


More Telugu News