బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా వనమాలే: షర్మిల

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించినవాళ్లేనన్న షర్మిల
  • దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలని విమర్శ
  • అఫిడవిట్లో చూపించింది గోరంతైతే దాచింది కొండంత అని మండిపాటు
బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ వనమాలేనని ఆమె విమర్శించారు. వీళ్లంతా ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించిన వాళ్లేనని అన్నారు. సమాజంలో దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలేనని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో చూపించింది గోరంతైతే దాచింది కొండంత అని అన్నారు. 

అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్టీపీ విజ్ఞప్తి చేస్తుందని షర్మిల తెలిపారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామని చెప్పారు.


More Telugu News