డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు.. నగరాన్ని మురికికూపంగా మార్చారు: కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

  • వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అయిందన్న రేవంత్
  • పుట్టిన రోజు మోజులో ఉన్న కేటీఆర్ ప్రజలను పట్టించుకోలేదని విమర్శ
  • వరదలపై  కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపాటు
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలంగా మారిందని, వరదలతో బాధ పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. పుట్టినరోజు వేడుకల మోజులో ఉన్న కేటీఆర్ ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వర్షాలు, వరదలపై కనీసం సమీక్షను కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 

హైదరాబాద్ ను డల్లాస్ గా, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ గా చేస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని... చివరకు తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నగరాన్ని మురికికూపంగా మార్చారని రేవంత్ అన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో ప్రజలకు మేలు జరిగే ఒక్క పని కూడా చేపట్టలేదని విమర్శించారు. 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... నాలాలు, వరద ప్రాంతలకు వెళ్లకూడదని రేవంత్ సూచించారు. పాడుబడ్డ ఇళ్లు, పాత భవనాల వద్దకు వెళ్లొద్దని చెప్పారు. పిల్లలను బయటకు పంపించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు అందుబాటులో ఉండి సహాయసహకారాలను అందించాలని పిలుపునిచ్చారు. ఈరోజు, రేపు ప్రజలకు ప్రభుత్వం సరైన సేవలను అందించాలని... లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


More Telugu News