కొండ మీదకు తీసుకెళ్లి రాత్రంగా ఏమేం చేయాలో అన్నీ చేశారు: గ్యాంగ్ రేప్ కు గురైన మణిపూర్ మహిళ

  • మణిపూర్ లో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న దారుణాలు
  • 19 ఏళ్ల గిరిజన మహిళపై దారుణంగా సామూహిక అత్యాచారం
  • ఏటీఎం వద్ద నుంచి బాధితురాలిని కిడ్నాప్ చేసిన దుండగులు
జాతుల మధ్య వైరంతో మణిపూర్ అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అంశంపై పార్లమెంటు ఉభయసభలు సైతం అట్టుడుకుతున్నాయి. మరోవైపు 19 ఏళ్ల ఓ గిరిజన మహిళ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురయింది. ఆనాడు (మే 15న) తాను అనుభవించిన నరకయాతనను ఆమె ఓ జాతీయ మీడియాతో పంచుకుంది. 

అప్పటికే మణిపూర్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హింస పెద్ద స్థాయిలో ప్రజ్వరిల్లుతోంది. దీంతో, ఎంతో మంది తమ ప్రాంతాల నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. 19 ఏళ్ల బాధితురాలు కూడా తాను ఉంటున్న ప్రాంతం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె ఏటీఎంకు వెళ్లింది. అక్కడ ఆమెను కొందరు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమె చెప్పిన వివరాల ప్రకారం...

"తెల్ల రంగు బొలెరో వాహనంలో నన్ను నలుగురు తీసుకెళ్లారు. ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు. డ్రైవర్ మినహా మిగిలిన ముగ్గురు నాపై సామూహిక అత్యాచారం చేశారు. గన్ బట్ తో నన్ను కొట్టారు. నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత నన్ను ఆ లోయ ప్రాంతంలో ఉన్న ఒక తిరుగుబాటుదారుల గ్రూపుకు అప్పగించారు. ఆ రాత్రి మొత్తం వాళ్లు నన్ను ఏమేం చేయాలో అన్నీ చేశారు. ఆ రాత్రి నరకం అనుభవించాను. తెల్లవారిన తర్వాత వాష్ రూమ్ కు వెళ్లాలని, నాకు కట్టిన కట్లను విప్పాలని వాళ్లని అడిగాను. వాళ్లలో ఉన్న ఒక మంచి వ్యక్తి నా కట్లను విప్పాడు. 

ఆ తర్వాత ఒకసారి చుట్టూ చూశాను. ధైర్యం తెచ్చుకుని, కొండ మీద నుంచి తప్పించుకోవాలనే నిర్ణయానికి వచ్చా. కొండ మీద నుంచి కిందకు పరుగెత్తుకుంటూ వచ్చాను. ఒక ఆటో డ్రైవర్ నాకు సహాయం చేశాడు. ఆటోలోని కాయగూరల కింద నన్ను దాచి, అక్కడి నుంచి తీసుకొచ్చాడు. చివరకు కాంగ్ పోక్పికి చేరుకున్నా" అని ఆమె తెలిపింది.  

ఆ తర్వాత ఆమె పొరుగు రాష్ట్రమైన నాగాలాండ్ రాజధాని కోహిమా ఆసుపత్రిలో చికిత్స పొందింది. జులై 21న ఆమె కాంగ్ పోక్సి పోలీస్ స్టేషన్ లో తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. కిడ్నాప్, అత్యాచారాలకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితులకు సంబంధించి తమకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మరోవైపు ఆమెకు జరిగిన దారుణంపై అందరూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News