రాజస్థాన్ లో వరదలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. వీడియో ఇదిగో!

  • బైక్ పై వంతెన దాటుతుండగా ఉప్పొంగిన వాగు
  • వంతెన రెయిలింగ్ ను పట్టుకుని సాయం కోసం యువకుల కేకలు
  • క్రేన్ సాయంతో బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్
రాజస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోతుండగా.. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎమర్జెన్సీ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా ఉదయ్ పూర్ లో నిర్వహించిన ఓ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఉదయ్ పూర్ సమీపంలోని మోర్వానియా టౌన్ లో ఇద్దరు యువకులు ఓ వంతెన దాటుతూ వరదలో చిక్కుకున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగు అకస్మాత్తుగా ఉప్పొంగింది.

వరద పోటెత్తడంతో యువకులు ఇద్దరూ వంతెనపై చిక్కుకుపోయారు. వారి బైక్ నీటిలో కొట్టుకుపోగా.. బ్రిడ్జి రెయిలింగ్ ను పట్టుకుని సాయం కోసం కేకలు పెట్టారు. స్థానికులు గమనించి ఎమర్జెన్సీ సిబ్బందికి సమాచారం అందించగా.. వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. భారీ హైడ్రాలిక్ క్రేన్ ను తెప్పించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఆ యువకుల బైక్ ను కూడా తర్వాత వెలికి తీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు.


More Telugu News