ఫేస్‌బుక్ ప్రేమలో అనూహ్య పరిణామం.. ఇస్లాం స్వీకరించి పాక్ ప్రియుడ్ని పెళ్లాడిన భారత మహిళ అంజు

  • ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాక్ వెళ్లిన అంజు
  • బంధుమిత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో నిఖా
  • వివాహానికి ముందు ఇస్లాం స్వీకరించి పేరును ఫాతిమాగా మార్చుకున్న అంజు
  • అంతకుముందు రోజు భారీ భద్రత మధ్య పర్యాటక ప్రాంతాల్లో విహారం
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్ మహిళ అంజు (34)కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లాంను స్వీకరించిన ఆమె ప్రియుడు నస్రుల్లా (29)ని నిన్న వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  ఖైబర్‌ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిర్ జిల్లాలోని స్థానిక కోర్టులో వీరి వివాహం జరిగిందని, నిఖాకు ముందు ఆమె ఇస్లాంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకుందని ఆయన వివరించారు. తమ వివాహంలో ఎవరి బలవంతమూ లేదని వధూవరులు అంగీకరించారని, బంధువులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసుల సమక్షంలో వారి వివాహం జరిగిందని తెలిపారు.

సోమవారం అంజు, నస్రుల్లా ఇద్దరూ భారీ భద్రత మధ్య స్థానిక పర్యాటక ప్రాంతాల్లో విహరించారు. ఓ గార్డెన్‌లో తీయించుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. తన ప్రేమను వెతుక్కుంటూ తాను ఇక్కడికి వచ్చానని, ఇక్కడే ఉండిపోతానని అంజు చెప్పినట్టు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, అంజుకు, తనకు మధ్య ఉన్నది ప్రేమ కాదని, స్నేహం మాత్రమేనని ఇటీవల నస్రుల్లా తెలిపాడు. ఆగస్టు 20తో ఆమె వీసా గడువు ముగుస్తుందని, ఆ తర్వాత ఆమె ఇండియా వెళ్లిపోతుందని చెప్పాడు. అంతలోనే ఆమెను వివాహం చేసుకోవడం ఇప్పుడు సంచలనమైంది.


More Telugu News