వరుణుడి దెబ్బ.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పడిపోయిన టీమిండియా స్థానం!

  • ఇటీవల ప్రారంభమైన డ‌బ్ల్యూటీసీ 2023-25 సైకిల్ 
  • వెస్టిండీస్‌తో సెకండ్ టెస్ట్ డ్రాగా ముగియడంతో తగ్గిన పాయింట్లు
  • రెండో స్థానంలో టీమిండియా.. టాప్‌లో పాకిస్థాన్
వెస్టిండీస్‌తో సెకండ్ టెస్ట్ డ్రాగా ముగియడంతో డ‌బ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా ర్యాంకు పడిపోయింది. ఫస్ట్ ర్యాంకు నుంచి రెండో స్థానానికి దిగింది. దాయాది పాకిస్థాన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. డ‌బ్ల్యూటీసీ 2023-25 సైకిల్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ సిరీస్‌తో టీమిండియా మూడోసారి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

తొలి టెస్టులో గెలిచిన.. రెండో టెస్టు కూడా గెలిచేదే. కానీ వరుణుడు అడ్డు రావడంతో చివరి రోజు ఆట సాగలేదు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఒక గెలుపు, ఒక డ్రాతో పాయింట్లు తగ్గిపోయాయి. 
ఇదే సమయంలో శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో గెలవడంతో పాకిస్థాన్ తొలి స్థానంలోకి వెళ్లింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు కూడా గెలిచేలానే ఉంది. దీంతో పాయింట్లు పెరగడంతోపాటు, తొలి స్థానంలోనే కొన్ని రోజులు పాక్ కొనసాగే అవకాశం ఉంది.

ప్రస్తుతం పాకిస్థాన్‌ 12 పాయింట్లు, ఇండియా 16 పాయింట్ల‌తో ఉన్నాయి. అయితే పాక్ 100 శాతం విన్నింగ్ పర్సంటేజీతో తొలి స్థానంలో ఉంది. టీమిండియా 66 శాతంతో ఉంది. ఇక ఈ లిస్ట్‌లో రెండు విజ‌యాలు, ఒక ఓట‌మి, ఒక డ్రాతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో.. ఒక గెలుపు, రెండు ఓట‌ములు, ఒక డ్రాతో నాలుగో స్థానంలో ఇంగ్లండ్ నిలిచాయి. వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక.. వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రెండేళ్లపాటు సుదీర్ఘంగా ఈ చాంపియన్‌షిప్ కొనసాగనున్న నేపథ్యంలో మ్యాచ్‌లు జరిగే కొద్దీ ర్యాంకులు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇక అంతకుముందు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధించింది. కానీ కప్‌ను అందుకోలేకపోయింది. తొలిసారి న్యూజిలాండ్, ఇటీవల ఆస్ట్రేలియా గెలిచాయి.


More Telugu News