భారీ వర్షాలకు ట్రాఫిక్ దిగ్బంధంలో హైదరాబాద్.. ఇవిగో వీడియోలు!
- హైదరాబాద్‌లో నిన్న రాత్రి కుండపోత వర్షం
- ప్రధాన రహదారులన్నీ జలమయం
- కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- గంటల కొద్దీ పడిగాపులు కాసిన సిటీ జనం
హైదరాబాద్‌లో నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షానికి నగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులన్నీ మోకాళ్లలోతు నీళ్లతో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు గంటల కొద్దీ పడిగాపులు కాశాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నిన్న రాత్రి పిడుగు పడింది. అయితే ఎవరూ లేని చోట పడటంతో ప్రమాదం తప్పింది. పిడుగు పడటానికి కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి నడిచి వెళ్లడం, తర్వాత పిడుగు పడటానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అత్తాపూర్‌లో జరిగినదిగా చెబుతున్నారు. ఇక అక్కడ పిడుగు పడటంతో అపార్ట్‌మెంట్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. పిడుగు శబ్దానికి స్థానికులు తీవ్ర భయందోళనలకు లోనయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.