‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పేరులోనూ ఇండియా ఉంది.. విపక్ష కూటమిపై మోదీ ఫైర్

  • ఉగ్ర సంస్థల పేర్లలోనూ ఇండియా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • పేరు మారినంత మాత్రాన వాటి తీరు మారుతుందా అంటూ ప్రశ్న
  • బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ
ప్రతిపక్ష కూటమి I-N-D-I-A పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేరు మార్చుకున్నంత మాత్రాన వాటి తీరుమారదని అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులోనూ ఇండియా ఉందని ప్రధాని గుర్తుచేశారు. అంతేకాదు, పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులోనూ 'ఇండియా' ఉందని విమర్శించారు. ఇప్పటి వరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాలను చూడలేదని మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం ఉదయం పార్లమెంటు లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు ప్రధాని మోదీ రాగానే పార్టీ నేతలంతా లేచి చప్పట్లతో స్వాగతించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. విపక్షాల కూటమిపై విమర్శలు గుప్పించారు. పేరు మార్చుకుని ఇండియా అని పెట్టుకున్నంత మాత్రానా వాటి తీరు మారుతుందని అనుకోలేమని చెప్పారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని మోదీ గుర్తుచేశారు. కాగా.. ఈ సమావేశంలో మణిపూర్ హింస నేపథ్యంలో విపక్షాల ఆందోళన, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.


More Telugu News