అజిత్ పవార్ మహారాష్ట్ర సీఎం అవుతున్నారన్న పృథ్వీరాజ్ చవాన్.. ఫడ్నవిస్ స్పందన ఇదే!

  • అగస్ట్ లో అజిత్ పవార్ సీఎం అవుతారన్న చవాన్
  • అజిత్ సీఎం అయ్యే అవకాశం లేదన్న ఫడ్నవిస్
  • ముఖ్యమంత్రిగా షిండేనే కొనసాగుతారని స్పష్టీకరణ
గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బీజేపీ అండతో శినసేనను చీల్చి ఏక్ నాథ్ షిండే సీఎం అయ్యారు. తాజాగా ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ నెలలో ఏక్ నాథ్ షిండేను తొలగించి అజిత్ పవార్ ను ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన చెప్పారు. చవాన్ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ... పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలను కొట్టిపడేశారు. అజిత్ పవార్ సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పారు. జులై 2కు ముందు జరిగిన చర్చల్లో సీఎం పదవి ఇచ్చే అవకాశం లేదని అజిత్ పవార్ కు స్పష్టంగా చెప్పామని తెలిపారు. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ నేతగా తాను చెపుతున్నానని... అజిత్ పవార్ ముఖ్యమంత్రి కారని చెప్పారు. సీఎంగా ఏక్ నాథ్ షిండేనే కొనసాగుతారని చెప్పారు. 

కావాలనే పృథ్వీరాజ్ చవాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫడ్నవిస్ విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలు గందరగోళానికి గురవుతారని, ఇలాంటి ప్రచారాలు ఆపాలని సూచించారు.


More Telugu News