పోలవరం ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ
- పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణ భూభాగంపై ఉందన్న టీఎస్ ప్రభుత్వం
- భద్రాచలంతో పాటు పలు గ్రామాలకు ముంపు ప్రమాదం ఉందని లేఖ
- గత ఏడాది 28 వేల ఎకరాల సాగుభూమి ముంపుకు గురైందని ప్రభుత్వం
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణ భూభాగంపై ఉందని లేఖలో తెలిపింది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం పట్టణంతో పాటు, పలు తెలంగాణ గ్రామాలకు ముంపు ప్రమాదం ఉందని చెప్పింది. గత ఏడాది గోదావరికి వరదలు వచ్చినప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం పరిసరాల్లో 28 వేల ఎకరాల సాగు భూమి ముంపుకు గురైందని తెలిపింది. దీనివల్ల కోట్లాది రూపాయల నష్టం జరిగిందని చెప్పింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని... అందువల్ల పోలవరంకు వచ్చిన వరదను వచ్చినట్టే వదిలేయాలని... పోలవరం 48 గేట్లు, స్లూయీలను తెరిచే ఉంచాలని లేఖలో కోరారు.