ఐఆర్ సీటీసీలో లోపం.. రైల్వే టికెట్ల బుకింగ్ కు అంతరాయం

  • వెబ్ సైట్, యాప్ లలో నిలిచిన సేవలు
  • సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారుల వెల్లడి
  • ఇతర యాప్ ల ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచన
రైల్వే టికెట్ల కోసం ఎక్కువమంది ఆశ్రయించే ఐఆర్ సీటీసీ వెబ్ సైట్, యాప్ తాత్కాలికంగా పనిచేయడంలేదు. సాంకేతిక సమస్యల కారణంగా టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి అమేజాన్, మేక్ మై ట్రిప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈమేరకు మంగళవారం ఉదయం ఐఆర్ సీటీసీ ట్వీట్ చేసింది.

సమస్య పరిష్కరించిన వెంటనే ట్విట్టర్ ద్వారా తెలియజేస్తామని ఐఆర్ సీటీసీ అధికారులు తెలిపారు. టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రాగానే ట్వీట్ చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఐఆర్ సీటీసీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మరోవైపు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా టికెట్ బుకింగ్ సాధ్యం కావడంలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఐఆర్ సీటీసీలో ఏర్పడిన సమస్యను త్వరగా సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


More Telugu News