ఉమ్మడి వరంగల్‌లో నేడు అతి భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ

  • మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు
  • జనగామ, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు
  • గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
  • నీరు ప్రవహించే కల్వర్టుల పైనుంచి ప్రయాణం వద్దంటూ హెచ్చరికలు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని అధికారులకు ఆదేశం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు; జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని, వారికి పునరావాసంతోపాటు రేషన్ ఇబ్బంది లేకుండా చూడాలని, గర్భిణులు ఆసుపత్రులకు దగ్గరలో ఉండేలా చూడాలని అధికారులకు సూచిస్తూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 

మరోవైపు, ఇప్పటికే కురిసిన వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. చేపల వేటకు దూరంగా ఉండాలని, నీరు ప్రవహించే కల్వర్టుల మీదుగా ప్రయాణించే సాహసం చేయొద్దని పేర్కొంది. పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వరి, మిరప పొలాల్లో నీరు నిల్వ వుండకుండా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచించారు. 

భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయంలో ప్రజలు హనుమకొండ- 1800 425 1115, వరంగల్- 91542 52937, మహబూబాబాద్- 79950 74803, భూపాలపల్లి- 90306 32608/ 1800 425 1123, ములుగు- 1800 425 7109, జనగామ- 63039 28718, వరంగల్ నగరపాలక సంస్థ- 1800 425 1980 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.


More Telugu News