విండీస్ టార్గెట్ 365 రన్స్... భారత్ గెలుపు ఆశలకు వరుణుడు అడ్డంకి

  • ట్రినిడాడ్ లో టీమిండియా, వెస్టిండీస్ రెండో టెస్టు
  • ఆటకు నేడు ఐదో రోజు
  • లక్ష్యఛేదనలో 2 వికెట్లకు 76 పరుగులు చేసిన విండీస్
  • వర్షం కారణంగా ఇంకా మొదలవని ఐదో రోజు ఆట
ట్రినిడాడ్ టెస్టులో ఐదో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. నాలుగో రోజు ఆటలో తన రెండో ఇన్నింగ్స్ ను 2 వికెట్లకు 181 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా... వెస్టిండీస్ ముందు 365 పరుగుల లక్ష్యాన్నుంచింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 38, రోహిత్ శర్మ 57, శుభ్ మాన్ గిల్ 29 (నాటౌట్), ఇషాన్ కిషన్ 52 (నాటౌట్) పరుగులు చేశారు. 

ఇక, భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన వెస్టిండీస్ జట్టు నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్ 28 పరుగులు చేయగా, కిర్క్ మెకెంజీ (0) డకౌట్ అయ్యాడు. వీరిద్దరినీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. 

ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ తేజ్ నారాయణ్ చందర్ పాల్ 24, జెర్మైన్ బ్లాక్ వుడ్ 20 పరుగులతో ఉన్నారు. వెస్టిండీస్ గెలవాలంటే ఇంకా 289 పరుగులు చేయాలి. ట్రినిడాడ్ లో వర్షం పడడంతో మ్యాచ్ ఐదో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. పిచ్ ను సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు.


More Telugu News