ఈ నెల 26 నాటికి బంగాళాఖాతంలో వాయుగుండం

  • దేశంలో మొదలైన తుపానుల సీజన్
  • క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాలు
  • జులై 25 నాటికి ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం
  • ఆపై, 24 గంటల్లో మరింత బలపడుతుందన్న ఐఎండీ
  • ఏపీ, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు
దేశంలో జులై నుంచి నవంబరు వరకు తుపానులకు అనువైన సీజన్ గా భావిస్తారు. ఈ సమయంలో తొలుత నైరుతి రుతుపవనాలు, ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు తుపానులకు అవసరమైన బలాన్ని అందిస్తాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. 

తాజాగా వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. 

ఇది జులై 25 నాటికి అల్పపీడనంగా మారుతుందని, జులై 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని ఐఎండీ వివరించింది. ఇది క్రమేపీ ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి పయనిస్తుందని పేర్కొంది. ఈ మేరకు గత అప్ డేట్ ను ఐఎండీ సవరించింది. 

తాజా బులెటిన్ ప్రకారం... ఈ నెల 24 నుంచి 28 వరకు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 

ముఖ్యంగా, జులై 25న కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలో జులై 25 నుంచి 27 వరకు అత్యంత భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వివరించింది.


More Telugu News