జులై 30న పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగం

  • మరో వాణిజ్యపరమైన ప్రయోగం చేపడుతున్న ఇస్రో
  • సింగపూర్ కు చెందిన పలు ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ-సి56
  • షెడ్యూల్ రూపొందించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో వాణిజ్యపరమైన రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో సన్నాహాలు జరుగుతున్నాయి. జులై 30న ఉదయం 6.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. 

శ్రీహరికోటలోని మొదటి లాంచ్ పాడ్ ఈ రాకెట్ ప్రయోగానికి వేదికగా నిలవనుంది. పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ద్వారా ప్రధానంగా సింగపూర్ డీఎస్ టీఏ-ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనుంది. 

దాంతోపాటే సింగపూర్ నాన్యాంగ్ టెక్నాలాజికల్ యూనివర్సిటీకి చెందిన వెలాక్స్-ఏఎం, ఆర్కేడ్, స్కూబ్-2 ఉపగ్రహాలను... సింగపూర్ న్యూస్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన న్యూలియాన్, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన గెలాసియా-2, ఏలియనా ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ కు చెందిన ఓఆర్ బి-12 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. 

కాగా, ఈ రాకెట్ ప్రయోగాన్ని ప్రజలు వీక్షించవచ్చని, ఆసక్తి గలవారు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఇస్రో సూచించింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించింది.


More Telugu News