ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి అదృశ్యం.. విశాఖలో పోలీసుల వెతుకులాట !

  • 17న ఐఐటీ క్యాంపస్ నుంచి వెళ్లిపోయిన కార్తిక్
  • సికింద్రాబాద్ నుంచి ట్రైన్‌లో వైజాగ్‌కు!
  • బీచ్‌లో ఉన్నట్లు ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు
  • మూడు రోజులు వెతికినా తెలియని ఆచూకీ
  • దీంతో కార్తిక్‌పై విశాఖపట్నంలో లుకౌట్ నోటీసు
ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ రెండో ఏడాది చదువుతున్న దానావత్ కార్తిక్ నాయక్ (21) అదృశ్యమయ్యాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి.. తిరిగి క్యాంపస్‌కు చేరలేదు. కార్తిక్‌ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ఈ నెల 19న క్యాంపస్‌కు వెళ్లి ఆరా తీశారు. అక్కడా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా కార్తిక్‌ విశాఖ వెళ్లినట్లు గుర్తించారు. 

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తిక్.. ఐఐటీ హైదరాబాద్‌లో చదువుతున్నాడు. ఈ నెల 17న కళాశాల నుంచి బయటకు వచ్చి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి విశాఖ వెళ్లాడు. ఈ నేపథ్యంలో కార్తిక్‌పై విశాఖపట్నంలో లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. విశాఖలోని బీచ్ రోడ్డులో పోలీసులు అతడి ఫోన్ సిగ్నల్స్ గుర్తించారు. 

కానీ మూడు రోజులుగా బీచ్ రోడ్డు మొత్తం వెతికినా అతడి ఆచూకీ తెలియరాలేదు. కార్తిక్ తన ఫోన్‌ నుంచి డబ్బు చెల్లించి బేకరీలో బన్‌ను కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ఫోన్‌ ఆఫ్‌ చేసినా.. సిగ్నల్స్‌ ట్రేస్‌ కాకముందే అక్కడి నుంచి అదృశ్యవుతున్నాడని సమాచారం.

కార్తీక్ ఎందుకు వైజాగ్ వెళ్లాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? ఫోన్ ఎందుకు ఆన్, ఆఫ్ చేస్తున్నాడు? తల్లిదండ్రులకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు కార్తిక్ మిస్సింగ్ ఓ మిస్టరీగా మారింది.


More Telugu News