మాస్టర్ ప్లాన్ వేసి టమాటా లారీని ఎత్తుకెళ్లారు... దొరికిపోయారు!

  • కర్ణాటకలో టమాటా లోడుతో వెళుతున్న మినీ లారీ చోరీ
  • తన వాహనాన్ని ఎత్తుకెళ్లారంటూ పోలీసులను ఆశ్రయించిన డ్రైవర్
  • యాక్సిడెంట్ జరిగిందని, తాను నష్టపరిహారం చెల్లించలేదని ఆ డ్రైవర్ వెల్లడి
  • దాంతో తన మినీ లారీ ఎత్తుకెళ్లారని వివరణ
  • కానీ టమాటాల కోసమే యాక్సిడెంట్ చేశారని విచారణలో వెల్లడి
కొన్ని నెలల కిందట కేజీ రూ.10 కంటే తక్కువ పలికిన టమాటా ధర ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో టమాటా ధరలు కిలో రూ.150 నుంచి దిగి రానంటున్నాయి. ఒకప్పుడు ధర లేక రైతులు రోడ్డుపక్కన పారబోసిన స్థితి నుంచి, ఇప్పుడు అత్యంత ప్రియంగా మారిన స్థితికి టమాటా ధరలు చేరుకున్నాయి. 

అంతేకాదు, టమాటాలు హత్యలకు దారితీయడం, టమాటా లోడులతో వెళుతున్న లారీలు చోరీకి గురికావడం కూడా సంభవిస్తోంది. ఇటీవల కర్ణాటకలో ఓ టమాటా లారీ చోరీకి గురైంది. 

ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు భాస్కరన్ (38), సింధుజ (35) అనే దంపతులను తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఆ దంపతులు చోరీ చేసిన టమాటా లోడును తమిళనాడులో రూ.1.6 లక్షలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. 

అసలు, ఈ టమాటా మినీ లారీ దొంగతనం సినీ ఫక్కీలో జరిగింది. ఏం జరిగిందంటే... జులై 8వ తేదీన శివన్న అనే లారీ డ్రైవర్ ఆర్ఎంసీ యార్డ్ పోలీసులను ఆశ్రయించాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన మినీ లారీని ఎత్తుకెళ్లారని శివన్న ఫిర్యాదు చేశాడు. అందులో 210 ట్రేల నిండా టమాటాలు ఉన్నాయని, వాటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని వెల్లడించాడు. 

చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ నుంచి కోలార్ ప్రాంతానికి ఆ టమాటాలు తీసుకెళుతున్నానని, అయితే, గోరగుంటెపాళ్య వద్ద చిన్న యాక్సిడెంట్ జరిగిందని శివన్న పోలీసులకు వివరించాడు. నీ మినీ లారీ మా మహీంద్రా జైలో వాహనాన్ని ఢీకొట్టిందని కొందరు వచ్చి నాతో వాగ్వాదం పెట్టుకున్నారు అని వెల్లడించాడు. 

మహీంద్రా జైలో వాహనంలోని వ్యక్తులు తనతో గొడవపెట్టుకున్నారని, నష్ట పరిహారం కింద రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారని, కానీ తాను అందుకు నిరాకరించడంతో టమాటా లోడుతో ఉన్న తన మినీ లారీని ఎత్తుకెళ్లారని శివన్న వివరించాడు. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఇదొక ఘర్షణ కేసుగా భావించారు. యాక్సిడెంట్ సందర్భంగా గొడవ జరిగి ఉంటుందని, ఆ కోపంలో లారీని ఎత్తుకెళ్లి ఉంటారని అనుకున్నారు. 

అయితే, ఈ కేసులో సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తే కేసును మలుపు తిప్పిన అంశం వెల్లడైంది. టమాటా లారీ, మహీంద్రా జైలో వాహనాలు తమిళనాడులోని వనియంబాడి వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజి ద్వారా వెల్లడైంది. అయితే, ఆ వ్యక్తులు చోరీ చేసిన వాహనం నెంబరు ప్లేటుపై ఉన్న అంకెలను చెరిపివేయడం అనుమానాలకు తావిచ్చింది. తమ మహీంద్రా జైలో వాహనం నెంబరు ప్లేటును మాత్రం యథాతథంగా ఉంచేయడంతో వారు దొరికిపోయారు. 

దాదాపు 200 సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించిన పోలీసులు... టమాటా లారీ చోరీకి పాల్పడిన వ్యక్తులను వనియంబాడిలో వారి నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు భాస్కరన్ పై ఇప్పటికే 10 దొంగతనం, దోపిడీ కేసులు ఉన్నట్టు గుర్తించారు. 

టమాటా లారీని చోరీ చేసేందుకే యాక్సిడెంట్, నష్టపరిహారం అంటూ నాటకం ఆడారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న కుమార్, మహేశ్ అనే వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


More Telugu News