పవన్‌ నీకు ట్యూషన్ తీసుకుంటా.. ముందు ఈ ఏడు పాఠాలను చదువు: బొత్స సత్యనారాయణ విసుర్లు

  • బైజూస్‌ కాంట్రాక్టుపై పవన్ చేసిన ట్వీట్‌కు బొత్స కౌంటర్
  • టెండర్‌‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఖరారు చేస్తారని వెల్లడి
  • విద్యా రంగంలో అత్యంత పారదర్శకమైన విభాగం తమదేనని ప్రకటన
  • పవన్‌ తీరుతో ఆయనకు పాఠాలు చెప్పిన టీచర్లు సిగ్గుపడతారని మండిపాటు
ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు మంత్రి బొత్స  సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. బైజూస్‌కు సంస్థకు ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిన అంశంపై పవన్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. తాను ఈ రోజు నుంచి పవన్‌ కల్యాణ్‌కు ట్యూషన్‌ తీసుకుంటానని చెప్పారు. ముందుగా ఒక అసైన్‌మెంట్‌ ఇస్తున్నానని, ఏడు పాఠాలను చదవాలని పేర్కొన్నారు. ఈ మేరకు బొత్స ట్వీట్ చేశారు. ‘‘డియర్ పవన్ కల్యాణ్.. ఈ రోజు నుంచి నేను మీకు ట్యూషన్స్ తీసుకుంటాను. అయితే హోమ్ వర్క్ చేస్తానని మీరు నాకు మాటివ్వాలి. ఈ 7 పాఠాలను చదవడమే మీకు తొలి అసైన్‌మెంట్” అని పేర్కొన్నారు.

బొత్స పేర్కొన్న ఏడు పాఠాలివే

1.పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లకు సంబంధించినంత వరకు అర్హత లేదా పరిధిని నిర్ణయించే అధికారాన్ని వదులుకున్న.. ప్రపంచంలోని ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వమని తెలుసుకోండి.

2. రూ.100 కోట్లకు పైబడిన ఏదైనా ప్రభుత్వ టెండర్ పరిధిని, అర్హతను.. హైకోర్టు సమ్మతితో నియమించిన ప్రత్యేక న్యాయమూర్తి (ఈ కేసు విషయంలో జస్టిస్ శివ శంకర్ రావు) ఖరారు చేస్తారు.  

3. టెండర్ స్పెసిఫికేషన్లను పబ్లిక్ డొమైన్‌లో  ఉంచుతాం. అదే సమయంలో వాటిపై ప్రతిస్పందించడానికి 21 రోజుల సమయాన్ని కంపెనీలకు ఇస్తాం. ఆ తర్వాత వీటిపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. ‍టెండర్‌ స్పెసిఫికేషన్‌ లాక్ అవుతుంది.

4. టెండర్ల స్పెసిఫికేషన్‌ విషయంలో ప్రపంచంలో న్యాయపరమైన సమీక్షకు వీలు కల్పించిన ఏకైక ప్రభుత్వం మాది అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం.

5. గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే..  మీకు ఈ నిర్దిష్ట టెండర్ విషయంలో భాగమైన అన్ని కంపెనీల వివరాలు తెలుస్తాయి. (ఆ టెండర్‌‌కు సంబంధించిన వివరాలు ఆగస్టు 2022 నుంచి పబ్లిక్ డొమైన్‌లో  ఉన్నాయి) లింక్‌ను మీకు మళ్లీ ఇస్తున్నాను.

6.ఏపీ విద్యా రంగానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఫలితాలు వెలువడే అత్యంత పారదర్శకమైన విభాగం మాది అని చెప్పుకోవడానికి మేం గర్విస్తున్నాం.

7. ప్రతిసారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని చూసి మీకు పాఠాలు చెప్పిన టీచర్లు సిగ్గుపడటం ఖాయం. అందుకే మీ మెదడులో పదును పెంచేందుకు నేను ప్రత్యామ్నాయ ట్యూషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.


More Telugu News