ట్విట్టర్‌లో ‘పిట్ట’ మాయం.. ఇకపై కొత్త లోగో!
- ట్విట్టర్ లోగోలో ‘పక్షి’ ఇకపై ఉండదన్న ఎలాన్ మస్క్
- త్వరలోనే అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నామని ప్రకటన
- ‘X’ లోగోను పెడుతున్నట్లు వెల్లడి
ట్విట్టర్ లోగో నుంచి పక్షి మాయమైపోతుందని ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ చెప్పారు. చాలా ఏళ్లుగా ట్విట్టర్‌కు ప్రధాన చిహ్నంగా ఉన్న ‘పిట్ట’ లోగో మార్పు విషయాన్ని ఆయన ఆదివారం వెల్లడించారు. ‘‘త్వరలోనే మేం ట్విట్టర్ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన X లోగో బాగుంటే.. రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుంది” అంటూ మస్క్ వరుస ట్వీట్లు చేశారు. ప్లాట్‌ఫామ్ కలర్‌ను డీఫాల్ట్‌గా బ్లాక్‌గా మారుస్తామని పేర్కొన్నారు.
మరోవైపు ట్విట్టర్‌లోని అన్ వెరిఫైడ్ ఖాతాల నుంచి డైరెక్ట్ మెసేజ్‌లు ఉంచడాన్ని పరిమితం చేస్తున్నట్లు శనివారం మస్క్ ప్రకటించారు. ‘‘డైరెక్ట్ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అన్‌వెరిఫైడ్ ఖాతాల నుంచి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డీఎం (డైరెక్ట్ మెసేజ్)లు చేయగలరు. నేడే సబ్ స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మెసేజ్‌లు పంపండి’’ అని పేర్కొన్నారు.