నేను అరెస్టు చేస్తే వాళ్లు లంచం తీసుకుని విడుదల చేస్తున్నారు..రహదారిపై హోంగార్డు నిరసన

  • పంజాబ్‌లోని జలంధర్‌లో జాతీయ రహదారిపై భోగ్‌పూర్ పోలీస్ స్టేషన్ హోంగార్డు నిరసన
  • సహోద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు ముందు  పడుకున్న వైనం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • హోంగార్డు ఆరోపణలను ఖండించిన పోలీస్ స్టేషన్ ఇంచార్జ్
సహోద్యోగుల అవినీతిని చూసి తట్టుకోలేకపోయిన ఓ హోంగార్డు హైవేపై నిరసనకు దిగారు. పంజాబ్‌‌లోని జలంధర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. హోంగార్డు నిరసనతో అక్కడ కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ‘‘నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్‌లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’’ అంటూ భోగ్‌పూర్ ప్రాంతంలో పఠాన్‌కోట్‌ హైవేపై హోంగార్డు నిరసనకు తెరలేపారు. 

తొలుత ఆ హోంగార్డు రహదారికి అడ్డంగా ఓ తాడు కట్టి ట్రాఫిక్ వెళ్లేందుకు మార్గం లేకుండా చేస్తూ నిరసనకు దిగారు. మరో పోలీసు అతడిని అడ్డుకోవడంతో ఈమారు రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకున్నారు. ఈ క్రమంలో అతడిని మరో పోలీసు కాలితో తన్నాడన్న ఆరోపణ కూడా సంచలనం కలిగిస్తోంది. 

హోంగార్డు ఆరోపణలపై భోగ్‌పూర్ స్టేషన్ ఇంచార్జ్ స్పందించారు. ఓ వివాదానికి సంబంధించి హోంగార్డు ఓ యువకుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకొచ్చాడని, అయితే అతడిని బెయిల్‌పై విడుదల చేశామని చెప్పారు.


More Telugu News