అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఎందుకంటే..!

  • హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసులపై విచారణకు నో
  • ధిక్కరణ నోటీసును వ్యతిరేకిస్తూ చేసిన అభ్యర్థన మాత్రమేనని వెల్లడి
  • అజారుద్దీన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమన్న సుప్రీం
టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎన్డీసీఏ) కేసులో తెలంగాణ హైకోర్టు కోర్టు తనకు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో అజారుద్దీన్ కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు జారీ చేసిన నోటీసులపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది కేవలం ధిక్కరణ నోటీసును వ్యతిరేకిస్తూ చేసిన అభ్యర్థన మాత్రమేనని, ఈ దశలో తాము అజారుద్దీన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని తెలిపింది.

అసలేం జరిగిందంటే.. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించే లీగ్ మ్యాచులలో పాల్గొనేందుకు తమను అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఎన్డీసీఏ రెండేళ్ల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం 2021-22 లీగ్ మ్యాచులలో అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత హెచ్‌సీఏ అనుబంధ జట్టుగా ఉన్న తమను భవిష్యత్తులో అన్ని సమావేశాలు, మ్యాచులు, టోర్నమెంట్స్ కు అనుమతించేలా హెచ్‌సీఏ, నాటి అధ్యక్షుడు అజారుద్దీన్, బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని ఎన్డీసీఏ కోరింది. కోర్టులో ఎన్డీసీఏకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 

అయితే, హైకోర్టు ఉత్తర్వులను పాటించడం లేదని, ఎన్డీసీఏ ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ను కూడా అజారుద్దీన్ అనుమతించలేదని పేర్కొంటూ.. ఈ ఏడాది ప్రారంభంలో ఎన్డీసీఏ తెలంగాణ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో గత ఏప్రిల్ లో అజారుద్ధీన్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. అయితే కోర్టు ఆదేశాలపై తానొక్కడినే నిర్ణయం తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని కోర్టు ఆగస్ట్ 4న మరోసారి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నోటీసులపై అజారుద్దీన్ సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడ చుక్కెదురైంది.


More Telugu News