బుల్డోజర్ ప్రభుత్వం అంటున్నారు.. బుల్డోజర్ ను ఎవరి పైకి తీసుకువస్తారు?: కిషన్ రెడ్డిని నిలదీసిన దాసోజు శ్రవణ్

  • డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బీజేపీ నేతలవి డ్రామాలన్న శ్రవణ్  
  • అవినీతి గురించి బీజేపీకి మాట్లాడే హక్కు లేదని విమర్శ
  • బుల్డోజర్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకో చెప్పాలని నిలదీత
  • కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఉద్దరిస్తామంటే నమ్మలేమని వ్యాఖ్య
డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. దళిత బంధుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. పథకాల్లో అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదని కేసీఆరే స్వయంగా చెప్పారన్నారు. అసలు కర్ణాటకలో మీ అవినీతికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. బీసీలను ఆదుకుంటామని బీజేపీ నేతలు చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బీజేపీ పాలనలో గ్యాస్ సహా అన్నింటి ధరలు పెరిగాయన్నారు.

అవినీతి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను దేశానికి ఎందుకు తిరిగి తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. బీజేపీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందన్నారు. విమానాశ్రయాలను అదానీకి కట్టబెట్టారన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే తన సొంత పార్టీ బీజేపీలోని సమస్యలను పరిష్కరించుకుంటాడని తాను భావించానని, కానీ ఇళ్లు సదురుకోకుండానే మా మీద పడ్డారన్నారు. ముందు మీ ఇల్లు చక్క దిద్దుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలను ఆదుకునే దేవుడిలా కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. 

తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం అంటున్నారని.. పనికిరాని ఆ బుల్డోజర్ ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. బుల్డోజర్ ను ఎవరి పైకి తీసుకు వస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్కడైనా ఈ పదం ఉందా? అని నిలదీశారు. అంటే తెలంగాణలో బెదిరిస్తున్నావా? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే బీజేపీ తీరు అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజం శాంతియుతంగా ఉందని, అభివృద్ధి సాగుతోందన్నారు. సంతోషంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని రజాకార్ సినిమా, బుల్డోజర్ పాలన అంటున్నారన్నారు. 

కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని తెలంగాణను ఉద్దరిస్తామంటే నమ్మేదేలా అన్నారు. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకున్నారని సొంత పార్టీ నేత విజయశాంతియే గట్టిగా విమర్శలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేయాలని, కానీ కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు చేయవద్దన్నారు. పోడు భూములకు సంబంధించి ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకే పట్టాలు ఇచ్చామన్నారు. 

బీజేపీ నేతలకు దమ్ముంటే ధారావిని అదానీకి అప్పగించి అభివృద్ధి అంటున్నారో.. హైదరాబాద్ లోను ఓ బస్తీని తీసుకొని అభివృద్ధి చేయాలని దాసోజు బీజేపీ నేతలకు సవాల్ చేశారు. ఇక్కడ ఓ బస్తీని తీసుకొని అభివృద్ధి చేసి ఆ బస్తీకి అదానీ, అంబానీ నగర్ అని పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. వారు ప్రజలను పట్టించుకోరు.. మేం మంచి చేస్తుంటే తగుదునమ్మా అని మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినట్లు ఇప్పుడు అధ్యక్షుడిగా కాగానే డ్రామాలు చేస్తే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మణిపూర్ విషయంలో నిద్రపోతున్నట్లుగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు తెలంగాణ రైతుల అభివృద్ధి విషయంలో నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వంటి వాటి గురించి బీజేపీ నేతలు సమాధానం చెప్పడం లేదన్నారు. కానీ దొంగ లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు డ్రామాలు చేస్తే తెలంగాణ సమాజం నిలదీస్తుందన్నారు. తెలంగాణకు నిధులు ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.


More Telugu News