ఇప్పుడు బెంగాల్‌లో.. ఇద్దరు మహిళలను చావబాది.. అర్ధనగ్నంగా ఊరేగింపు

ఇప్పుడు బెంగాల్‌లో.. ఇద్దరు మహిళలను చావబాది.. అర్ధనగ్నంగా ఊరేగింపు
  • పశ్చిమ బెంగాల్‌లోని మల్దా జిల్లాలో ఘటన
  • దొంగతనం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన మహిళలు
  • పట్టుకుని చితక్కొట్టిన మహిళా వ్యాపారులు
  • వీడియో వైరల్ అయ్యాకే తమకు తెలిసిందన్న పోలీసులు
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహావేశాలు చల్లారకముందే పశ్చిమ బెంగాల్‌లోనూ అలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు మహిళలను చావబాది అర్ధనగ్నంగా ఊరేగించారు. మల్దాలోని పకౌహట్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ప్రాథమిక సమాచారం ప్రకారం మూడు నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో ఇద్దరు మహిళలను పట్టుకున్న స్థానికులు వారిని ఈడ్చిపడేసి దాడిచేశారు. వారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.  

వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతే విషయం గురించి తెలిసిందన్నారు. బాధిత మహిళలు ఇద్దరూ దొంగతనం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. దొరికిన మహిళలపై స్థానిక మహిళా వ్యాపారులు దాడిచేసినట్టు తెలిపారు. ఆ తర్వాత బాధిత మహిళలు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. దొంగతనంపై వ్యాపారులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. దర్యాప్తు అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.


More Telugu News