నాపై ఢిల్లీలో ఫిర్యాదు చేశారు సరే.. కిషన్‌రెడ్డిని స్వేచ్ఛగా పని చేయనివ్వండి: బండి సంజయ్

  • తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిర్యాదు చేశారని సంజయ్ ఆవేదన
  • ఫిర్యాదు చేసి కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని హితవు
  • అధ్యక్షుడిగా కష్టపడి పని చేశాననే సంతృప్తి ఉందని వ్యాఖ్య
తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి తనపై కొంతమంది ఫిర్యాదు చేశారని, సరే కానీ.. ఇప్పుడు కిషన్ రెడ్డిని సరిగ్గా స్వేచ్ఛగా పని చేసుకోనివ్వండని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బండి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన అసంతృప్త నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎవరి పేరును ప్రస్తావించలేదు. కానీ ఫిర్యాదుదారులకు మాత్రం చురకలు అంటించారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపేయాలని, తప్పులు చూపడం బంద్ చేయాలన్నారు. తప్పుడు ఫిర్యాదులతో కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని ఉద్వేగానికి లోనయ్యారు.

తనపై సొంత పార్టీలోనే కొంతమంది అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారన్నారు. అధ్యక్షుడిగా కష్టపడి పని చేశాననే సంతృప్తి తనకు ఉందన్నారు. సోషల్ మీడియాలో, వార్తా పత్రికలలో ఉండటం కాదని, ప్రజల్లో ఉండాలన్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచలేదని, కానీ కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.


More Telugu News