24 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం పడే అవకాశం!

  • మూడు జిల్లాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక
  • అత్యవసర సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చిన జీహెచ్ఎంసీ
  • నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్
హైదరాబాద్ లో మరో ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వర్షానికి అవకాశముందని, ఈ మూడు జిల్లాల ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జలమండలి తాగునీటి సరఫరా, నాణ్యతపై దృష్టి సారించింది. నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది.

హుస్సేన్ సాగర్ ను పర్యవేక్షించాలి: తలసాని

హుస్సేన్ సాగర్ కు భారీ వరద నీరు వస్తోందని, ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.

భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ ను దాటింది. ఫుల్ ట్యాంక్ లెవ‌ల్ సామ‌ర్థ్యం 513.45 మీట‌ర్లు కాగా, 514.75 మీట‌ర్లను దాటింది. దీంతో దిగువ‌కు నీరు విడుద‌ల చేస్తున్నారు.


More Telugu News